ఆ రోజు ఆదివారం అవటం చేత పొద్దున్నే కాఫీ తాగేసి పార్కు వైపు బయలుదేరాడు ఎంచక్కా. రామూర్తిగారు రానే వచ్చారు. "ఏవిటండీ! అంత దొంగతనం జరిగినంత పని అయితే, తమరు ఎమీ జరగనట్టు ఇలా పార్కు లకి షికార్లకి తిరుగుతున్నారు?" అన్నాడు సుబ్బారావు బెంచీ వైపు నడుస్తూనే. రామూర్తిగారికి మహా చెడ్డ కోపం వచ్చింది. "ఏమోయి సుబ్బారావు, ఏం దొంగతం జరగబోతే మాత్రం పార్కు కి రాకూడదా ఏమి! గొప్పవాడివయ్యా" అని చిరాకుపడ్డారు. "అది కాదు మహాప్రభో, దొంగతనం ఎందుకు ఎలాగా అని తనిఖీ చెయ్యకుండా ఇలా పార్కుకి వచ్చేసారేమిటి అని అడిగానండి. ఇంతకీ మీ జాకీ మటుక్కూ మహా మంచి కుక్క లెండి." అంటూ ఎంత బ్రతిమలాడినా రామూర్తిగారి కోపం తగ్గినట్లు కనిపించలేదు. ఆ కుక్క పెరేత్తద్దు అని కసిరారు కూడాను. సరే నాకేమిలే అనుకుంటూ సుబ్బారావు ఇంటి దారి పట్టాడు. భోజనం టయానికి ఇంటికి వెళ్ళకపోతే, చిర్రు బుర్రులాడుతుంది కళ్యాణి.
సోమవారం సుబ్బారావు బ్యాంకు నుంచి ఇంటికివచ్చేటప్పటికి కళ్యాణి గుమ్మం లోకి వచ్చి నుంచుంది కాఫీ తో. "ఇది విన్నారూ? మీ స్నేహితుడు ఉన్నారే రామూర్తిగారు! ఆయన్ని పొలీసులు పట్టుకుపోయారట. ఆ దొంగతనం అంతా ఆయన ఆడించిన నాటకమే అట. ఇంకం టాక్స్ వాళ్ళు రైడ్ చేస్తారని ముందే తెలిసి సామాను ఇంట్లోంచి బయటకి పంపించటానికి ఆయన వేసిన ప్లాను కాస్త ఆ కుక్క కొల్లగొట్టింది." అని ఊపిరి పీల్చు కోకుండా చెప్పేసింది కళ్యాణి!